
భారత క్రికెట్‌లో ఎందరో చీఫ్ సెలెక్టర్లను చూశాం. కానీ, సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన వాళ్లు మాత్రం కొందరే. ప్రస్తుతం ప్రధాన సెలెక్టర్ పదవిలో ఉన్న అజిత్ అగార్కర్ (Ajit Agarkar) కచ్చితంగా రెండో కోవకే చెందుతాడు. ప్రతిసారి స్క్వాడ్ ఎంపికలో తనదైన ముద్ర వేస్తున్నాడీ మాజీ పేసర్. ఇంగ్లండ్ పర్యటనకు స్క్వాడ్ ఎంపిక నుంచి ఆసియా కప్ (Asia Cup).. ఇప్పుడు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ వరకూ అతడు తనదైన పంథాను కొనసాగిస్తున్నాడు. సీనియర్లకు చెక్ పెడుతూ భావితారలకు భరోసానిచ్చేలా స్క్వాడ్ ఎంపిక ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని చెప్పకనే చెబుతున్నాడు అగార్కర్. అందుకే.. తన నిర్ణయాలను కొంతమంది విమర్శించినా.. టీమిండియా ప్రయోజనాలే తనకు ముఖ్యమని మొండిగా ముందుకు వెళ్తున్నాడు అతడు. మాజీ పేసర్ అయిన అగార్కర్ 2023 జూలై 4న చీఫ్ సెలెక్టర్ పదవి చేపట్టాడు. అప్పటి నుంచి అతడి ప్రతి నిర్ణయం సీనియర్లను ఆశ్చర్యపరిచేలా.. జూనియర్లకు అవకాశాలు కల్పించేలా ఉంటోంది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) సలహాలు, సూచనల్ని పాటిస్తూనే.. జట్టుకు ఉపయోగపడే ఆటగాళ్లను మాత్రమే తీసుకుంటున్నాడు అగార్కర్.