
భారత క్రికెట్‌లో దిగ్గజ కెప్టెన్ అనగానే మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni), విరాట్ కోహ్లీ (Virat Kohli), సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) అని ఠక్కున చెబుతారు చాలామంది. కానీ, రికార్డులు చూస్తేనే రోహిత్ శర్మ (Rohit Sharma) వీరందరికంటే ‘ది బెస్ట్’ అని తెలుస్తుంది. టీమిండియాకు వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీలు, అత్యధిక విజయాలు అందించిన సారథి అతడే. అయితే.. ఆస్ట్రేలియా పర్యటనకు స్క్వాడ్ ఎంపికతో కెప్టెన్‌గా రోహిత్ ప్రస్థానం ముగిసింది. వచ్చే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని యువకుడైన శుభ్‌మన్ గిల్ (Shubman Gill)కు పగ్గాలు అప్పగించారు సెలెక్టర్లు. ఇప్పటికే టీ20, టెస్టు కెప్టెన్సీతో పాటు ఈ రెండు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన ఈ డాషింగ్ బ్యాటర్ ఇక ఆటగాడిగానే ఆసీస్ సిరీస్‌లో ఆడనున్నాడు.
టీమిండియాను వన్డేల్లో తిరుగులేని జట్టుగా నిలిపిన ఘనత రోహిత్‌కే దక్కుతుంది. ఎందుకంటే.. అతడి సారథ్యంలోనే టీమిండియా అత్యధికంగా 75శాతం విజయాలు నమోదు చేసింది. హిట్‌మ్యాన్ నేతృత్వంలో 56 వన్డేలు ఆడిన భారత జట్టు 42 మ్యాచుల్లో జయకేతనం ఎగురవేసింది. ఒక మ్యాచ్ టైకాగా.. మరొక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. అంతర్జాతీయంగా 50 వన్డేలకు కెప్టెన్సీని పరిగణనలోకి తీసుకుంటే.. వెస్టిండీస్ వెటరన్ క్లైవ్ లాయిడ్ (Clive Lloyd) టాప్‌లో ఉన్నాడు.