తెలంగాణలో మరో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల బైపోల్ కు నోటిఫికేషన్ విడుదలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించడంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రిజైన్ చేశారు. దీంతో ఆ రెండు స్థానాల్లో ఉపఎన్నికలకు ఎన్నికల సంఘం విడివిడిగా షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 18 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 29న రెండు స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. ఈ రెండు ఎమ్మెల్సీల పదవీకాలం 2027 నవంబర్ వరకు ఉంది. కొత్తగా కొలువుదీరిన అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి సీపీఐతో కలిసి 65, బీఆర్ఎస్కు 39, బిజెపికి 8, ఎంఐఎంకు 7గురు సభ్యుల బలం ఉంది. దీంతో ఆ రెండు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎంఐఎం, బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చినా ఒక సీటు కూడా గెలవడం కష్టమే. వేర్వేరుగా కాకుండా రెండు స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నిక నిర్వహిస్తే ఒక సీటు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని ఆపార్టీ నేతలు వాదిస్తున్నారు. గతంలో ఒకే రోజున.. ఒకే నోటిఫికేషన్ ద్వారా కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ఎన్నికైయ్యారు. ఇప్పుడు ఆ ఇద్దరి స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు EC విడివిడిగా షెడ్యూల్ ప్రకటించడంపై బీఆర్ఎస్ మండిపడుతోంది. కాంగ్రెస్ కు మేలు చేసేందుకు ఈసీ వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్కు 30 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ఒక్కరే ఉన్నారు. ఈ నేపథ్యంలో మండలిలో పట్టు కోసం గట్టిగా వాయిస్ వినిపించే నేతలను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ప్రకటించి బీ ఫారం ఇవ్వకుండా ఆపేసిన చిన్నారెడ్డికి..ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. ఇక చివరి వరకు టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డ ఉమ్మడి నల్లగొండ జిల్లా నేత అద్దంకి దయాకర్ పార్టీకి విధేయుడిగా ఉండడంతో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే ఒక సీటు ఉద్యమ నేత, టీజేఎస్ ప్రెసిడెంట్ కోదండరామ్‌కు దాదాపు ఖాయమని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కోదండరామ్‌కు కీలక పదవి ఇస్తారని పలువురు నేతలు చెబుతున్నారు. మరోవైపు మైనార్టీ నేతలు హబీబ్, షబ్బీర్ అలీ, ఫిరోజ్‌ఖాన్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఎమ్మెల్సీ సీట్లు ఎంపిక కాంగ్రెస్ కు కత్తిమీద సాములా మారింది.