2019 బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో చోటుచేసుకున్న ఆసక్తికరమైన విషయాలను మాజీ దౌత్యవేత్త అజయ్ బిసారియా పుస్తక రూపంలో తీసుకొస్తున్నారు. అయితే వైమానిక దాడుల అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను తగ్గించే దిశగా మధ్యవర్తిత్వం వహించడానికి వివిధ దేశాలు ప్రయత్నించినట్టు తెలిపారు భారత మాజీ దౌత్యవేత్త అజయ్ బిసారియా. ఆ సమయంలో చైనా సైతం ఓ ఉపమంత్రిని భారత్ , పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి సామరస్యపూర్వక వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నించినట్టు బిసారియా వెల్లడించారు.కానీ, భారత్ చైనా ప్రయత్నాన్ని సున్నితంగా తోసిపుచ్చినట్టు తన బుక్ లో రాసుకొచ్చారు. బాలాకోట్ వైమానిక దాడి మరుసటి రోజు 2019 ఫిబ్రవరి 27న పాకిస్తాన్ మైమానిక దళం ఎఫ్-16 విమానాలతో భారత్ పై దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది. అయితే పాక్ దాడిని తిప్పికొట్టే సమయంలో భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాక్ భూ భాగంలో కూలడంతో అభినందన్ దాయాది జవాన్లకు చిక్కడంతో అతన్ని తీవ్రంగా హింసించారు. అభినందన్ ను తీసుకొచ్చేందుకు భారత్ వైమానికి విమానం పంపాలని సిద్దమైందని, కానీ అందుకు పాకిస్తాన్ నిరాకరించినట్టు బిసారియా వెల్లడించారు. బాలాకోట్ దాడుల తర్వాత భారత్ రగిలిపోయిందని, పాక్ పై దాడికి తొమ్మిది క్షిపణులను సిద్దం చేసిందని..వాటిని ఏ క్షణంలోనైనా ప్రయోగించే అవకాశం ఉందని పాక్ విదేశాంగ కార్యదర్శి తెహ్ మినా జన్ జువాకు ఆ దేశ సైనికాధికారులు సమాచారం అందించారని, ఆ సమాచారాన్ని ఆమె వెంటనే అమెరికా, యూకే, ఫ్రాన్సు రాయబారులకు తెలిపిందని బిసారియా పుస్తకంలో రాశారు. క్షిపణులు ప్రయోగించకుండా భారత్ కు సర్థి చెప్పాలని ఆయా దేశాల రాయబారులను కోరింది. వారు వెంటనే స్పందించి భారత్ క్షిపణులు ప్రయోగించకుండా చూడాలని ఆయా దేశాలకు సమాచారం అందించినట్టు బిసారియా తన పుస్తకంలో రాసుకొచ్చారు. ఆ సమయంలో పాకిస్థాన్ గడగడలాడినట్టు తెలిపారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ లో మాట్లాడేందుకు ప్రయత్నించారని, అయితే ఇమ్రాన్ తో మాట్లాడేందుకు మోదీ నిరాకరించినట్టు రాశారు బిసారియా. వైమానిక దాడుల నేపథ్యంలో అప్పటి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనా సాయం కోరినట్టు బిసారియా వెల్లడించారు. భారత్ కు అమెరికా మద్దతు ఇస్తుందని, తమ దేశానికి సపోర్టు చేయాలని చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ను ఇమ్రాన్ ఖాన్ కోరారని, అయితే ఇమ్రాన్ అభ్యర్థనను చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తోసిపుచ్చినట్టు బిసారియా తెలిపారు. అమెరికా,భారత్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని, భారత్ కు వ్యతిరేకంగా పాక్ కు మద్దతివ్వబోమని షీ జిన్ పింగ్ తెలిపినట్టు బిసారియా తన పుస్తకంలో రాశారు. నేరుగా భారత్ తో సంప్రదింపులు జరపాలని చైనా సూచించినట్టు బిసారియా పేర్కొన్నారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలోని సైనిక కాన్వాయ్ పై ఉగ్రవాదులు మెరుపుదాడులు చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా బాలాకోట్ లోని ఉగ్రశిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేపట్టింది. ఫిబ్రవరి 27న పాక్ వైమానిక దళం ఎఫ్ -16 విమానాలతో భారత్ పై దాడికి యత్నించగా, వింగ్ కమాండర్ అభినందన్ వింగ్ -21 విమానంతో ఎదురుదాడి చేసి పాక్ ఎఫ్-16ను నేలకూల్చారు. అదే సమయంలో ఆయన విమానం కూడా కూలిపోవడంతో పారాచూట్ సాయంతో కిందకు దూకారు. అయితే అభినందన్ పాక్ భూభాగంలో పడ్డారు. అభినందన్ ను పాక్ జవాన్లు చిత్రహింసలు పెట్టడంతో ..అభినందన్ ను భారత్ కు అప్పగించాలని వివిధ దేశాలు పాక్ పై ఒత్తడి చేయడంతో వాఘా సరిహద్దు వద్ద అభినందన్ ను భారత్ కు అప్పగించినట్టు తన పుస్తకంలో రాశారు బిసారియా.